4, మే 2013, శనివారం

1. అర్జున విషాద యోగము




1. ధృతరాష్ట్రుడు పలికెను:-

శ్రీ మహాభారత యుద్ధ రంగం లో జరుగు చున్న విశేషాల్ని ధృతరాష్ట్రుడు వినాలనే సంకల్పం తో " ధర్మ క్షేత్ర మైన కురుక్షేత్రం లో యుద్దాభిలాష తో నా వారును, పాండవులు ను చేరారు కదా? వారంతా ఏం చేస్తున్నారు?" అని సంజయుని అడిగాడు. 

2. సంజయుడు పలికెను:-

ధృతరాష్ట్రుని కోరిక ను మన్నించి వ్యాస మహర్షి ప్రసాదించిన దివ్య దృష్టి బలం తో సంజయు డాతనితో "రాజా! నీ కోర్కె ప్రకారమే విషయాలన్నీ చెబుతాను విను. పాండవ బలం వ్యూహంగా ఏర్పడి యుండటం దుర్యోధనుడు చూచి ద్రోణుని దగ్గరకు వెళ్ళి  ఈ విధంగా విన్నవించుకొన్నాడు. 

3. "గురుదేవా! ద్రుపద పుత్రుడునూ, మీ శిష్యుడు నూ, ధీమంతుడూ  నైన ద్రుష్టద్యుమ్నుడు, పాండవుల సైన్యాన్ని యొక వ్యూహంగా నేర్పాటుచేశాడు. ఆ వ్యూహాన్ని పరికించండి! "


4,5,6.  ఆ పాండవ సైన్యం లో శూరులను, గొప్ప విలుకాండ్రును, యుద్ధం లో భీమార్జునులకు సమానులగు యుయుధానుడు, విరాటుడు, మహారధి ద్రుపదుడు, ద్రుష్టకేతుడు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీ రాజు, కుంతిభోజుడు, పురుశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమశాలియైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర గారాల పట్టి యైన యభిమన్యుడు, ద్రౌపదీపుత్రులైదుగురు నున్నారు. వీరే పాండవ సైన్యం లో మహారధులు. 


7,8,9. ఇక నా ప్రక్క నున్నవారిలో చెప్పుకోదగ్గవారు మీరు, భీష్ముడు, కర్ణుడు, జయశీలియైన కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు, సోమదత్తుడు, ఇంకా అనేకులైన మహాశూరులు,
శస్త్రాస్త్ర వేత్తలు, రణకోవిదులు, నా కొరకు ప్రాణాలొడ్డేందుకు సిద్ధపడే యోధులెందరో వున్నారు. 


10. భీష్మునిచే రక్షింపబడుతున్న మనసేన అపారమైనది. ఇక భీమునిచే రక్షింపబడుతున్న పాండవులసేన అంత పెద్దది కాదు.    


11. అయినను సైన్యమునందన్ని తావులలోను మీరందరూ ఎవరి స్థానంలోవారుండి భీష్ముని రక్షణ యందు  ఏమరుపాటు లేకుండగా వుండండి! (శత్రు వధ తో పాటు- శిఖండి భీష్ముని తాకకుండగా చూడటం మన ప్రధాన కర్తవ్యం  అన్నాడు). 

12. ఆ సమయంలో రారాజు నాకుత్సాహం కలిగించాలని కురుపితామహుడైన భీష్ముడు వృద్ధుడై యున్నప్పటికిని సింహనాదం చేసి బిగ్గరగా శంఖాన్ని పూరించాడు. 

13. వెంటనే కౌరవులంతా తమ తమ శంఖాల్ని పూరించారు. భేరులు, తప్పెటలు  ఒక్క సారిగనే దిక్కులాదిరే విధంగా మ్రోగాయి. 


14,15,16. అంతలో తెల్లని గుర్రాలు కట్టిన రథం మీద కూర్చునియున్న కృష్ణార్జునులు తమ దివ్యశంఖాల్ని పూరించారు. అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని, కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించటం  చూచి, భయంకర పనులుచేసే భీముడు తన పౌండ్రాన్ని, ధర్మరాజు అనంతవిజయమనే శంఖాన్ని, నకులుడు ఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించాడు.   

17,18. మహా ధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయాన్ని ఎరుగని సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదేయులు, అభిమన్యుడు - వీరంతా అన్ని వైపులనుండి తమ తమ శంఖాల్ని పూరించారు. 

19. పాండవ సేనలో పుట్టిన ఈ శంఖాల ధ్వనికి కౌరవుల గుండెలదిరాయి. అనగా -కౌరవ సైన్యానికి ధైర్యం తప్పటం వాళ్ళ భయభ్రాంతులైయ్యారు. 


20,21. అటువంటి సమయంలో కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధంగానున్న కౌరవుల్ని చూచి, తన గాండీవాన్ని చేతితో పట్టుకొని, "బావా!మన రథాన్ని రెండు సేనల మధ్య లో నిలుపు" మని కోరాడు. 

అర్జునుడు పలికెను:-
22,23. దుర్బుద్ధి యైన దుర్యోధనునకు యుద్ధం లో సహాయపడి అతనికి  ఆనందాన్ని కలిగించాలని వచ్చినవారెవరో, ఎవరి తో తానూ యుద్ధం చేయాల్సి వుంటుందో వారి నందరిని ప్రత్యక్షంగా చూస్తానని. 

సంజయుడు పలికెను:-
24,25. ఈ విధంగా అర్జునునిచే ప్రేరేపింపబడ్డ శ్రీ కృష్ణ భగవానుడు రథాన్ని రెండు సేనలకు మధ్యలోను, భీష్మద్రోణులకును సకల మహీపతులకు ను ఎదురుగ నిలిపి "పార్థా! యుద్ధానికి వచ్చిన కౌరవ బలాన్ని చూడు" అన్నాడు. 


26,27,28. అప్పుడక్కడ నిలిచియున్న  తన తండ్రులు, తాతలు, గురువులు, అన్నదమ్ములు, కొడుకులు,  మనుమలు, స్నేహితులు, మామలు, అన్ని రకాల బంధువులు అర్జునుని కంటబడ్డారు. వారి నందరిని చూచి జాలిపడి, గుండెకరిగి దుఃఖిస్తూ -

29,30,31. " కృష్ణా! యుద్ధం చేయాలని యిక్కడ గుమిగూడి యున్న ఆత్మబంధువులందరినీ చూడటం వలన నా మనస్సు తల్లడిల్లి పోతోంది. నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి. నోరు ఎండిపోతోంది. శరీరం వణుకుతోంది., ఒడలు పులకరిస్తోంది. చేతిలో నుండి గాండీవం జారిపోతోంది. శరీరతాపం పెరుగుతోంది. శరీరాన్ని కాని, మనస్సుని కాని, నిలుపుకొనలేని స్థితి లోనికి వచ్చాను. విపరీతమైన అపశకునాలు కనిపిస్తున్నాయి. నా వారిని యుద్ధంలో చంపటం వలన మేలేమి జరుగుతుందో యూహించ లేక పోతున్నాను.  

32,33,34. "కృష్ణా! నాకు జయ మక్కరలేదు. రాజ్యం గాని సుఖం గాని యవసరం లేదు. గోవిందా!  మాకీ రాజ్యాలెందుకు? ఈ భోగాలెందుకు? ఈ జీవితం ఎందుకు? ఈ రాజ్యాన్ని, ఈ భోగాల్ని ఈ సుఖాల్ని వీరందరి కొరకే కదా నేను సంపాదించాలనుకున్నది! అట్టి వారిప్పుడు ప్రాణాలను, ధనాలను కూడా లెక్క పెట్టకుండగ యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వీరంతా ఎవరు? గురువులు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనుమలు, మామలు, మేనమామలు, బావలు, మరుదలు,
వియ్యంకులు, మొదలైన ఆత్మబంధువులే కదా!

35. మమ్ము  చంపినాసరే! ముల్లోకాలకు ఆధిపత్యం యిచ్చి నప్పటికిని వీరిని నేను చంపలేను. ఇక భుమికొరకు వీరిని చంపగలనా? 


36. జనార్ధనా! ఈ ధార్తరాష్ట్రుల్ని చంపడం వలన నా కేమి సంతోషం కలుగుతుంది? వీరు ఆకతాయులేయైనను వీరిని చంపటం వలన నాకు పాపమే ప్రాప్తిస్తుంది. 

37. అందుచేత బంధువులైన ఈ దుర్యోధనాదుల్ని చంపటం మాకు ధర్మం కాదు. మనవారిని చేజేతులార చంపి యేవిధంగా సుఖపడగలం?

38,39. వీరు లోభం వలన తమ్ముతాము మరిచి కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని గుర్తించటం లేదు.  కులక్షయం వలన కలిగే దోషాన్ని కండ్లారా చూస్తూ మనమీ పాపాన్నుండి ఏవిధంగా తప్పించుకోగలం?

40,41. కులక్షయం గలిగినట్లైతే అనాది నుండి వస్తున్నా కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినట్లయితే అధర్మం ప్రబలుతుంది. మన స్త్రీలు పతిత లవుతారు. స్త్రీలు చెడిపోయినట్లయితే వర్ణసంకర మవుతుంది.  

42. వర్ణసాంకర్యం వలన కులం వారికిని, కులఘాతకులకును కూడా నరకం తప్పదు. పితృదేవతలకు పిండోదకా లిచ్చేవారు లేకపోవడం వలన వారు అధోగతి పాలవుతారు. 

43,44. కులనాశకులు గావించే వర్ణసాంకర్య హేతువైన ఈ దోషాల మూలంగా శాశ్వతాలైన జాతి ధర్మాలు అడుగంటుతాయి. ధర్మ హాని వల్ల  మానవులకు శాశ్వతమైన నరకలోక ప్రాప్తి కలుగుతుంది అని వింటూ వుంటాం. 

45,46. అయ్యో! రాజ్యసుఖాలు కోరుకొని, మనవారినే చంపేందుకు సిద్ధపడి మహాపాపానికి  ఒడిగట్టుకోబోతున్నామే! నాకు వారిమీద పగతీర్చుకొన కోరిక లేదు. నేను బాణాన్ని చేపట్టను. కౌరవులు ఆయుధాలతో వచ్చి నన్ను చంపినను  చంపని - అదే నాకు చాల క్షేమమవుతుంది. 

47. అని చెప్పి అర్జునుడు రథం పై చతికిలపడ్డాడు. అతని మనస్సు దుఃఖం తో నిండిపోయింది. అతడు ధనుర్బాణాల్ని  త్యజించాడు. 


ఇది శ్రీ కృష్ణార్జున సంవాదమును, యోగశాస్త్రమును,
బ్రహ్మవిద్యయును, ఉపనిషత్తును అగునట్టి 
శ్రీమద్భగవద్గీత యందలి అర్జున విషాద యోగ మనబడే మొదటి అధ్యాయం.    




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి