సంజయుడు పలికెను:
1. మహావీరుడైన అర్జునుడు ఆ విధంగా దయార్ద్ర హృదయం తో కన్నీరు కారుస్తూ దుఃఖం లో మునిగి యుండటం శ్రీ కృష్ణభగవానుడు చూచి
శ్రీ కృష్ణుడు పలికెను:-
2. ఓహో! అర్జునా! ఇటువంటి విషసమయంలో నిటువంటి దుఃఖం తగినదేనా? పామరునివలె చింతిస్తున్నా వెందుకు? దీనివలన నీకు స్వర్గం, కీర్తి దూరమవుతాయి కదా!
3. పార్థా! నీవు పిరికి వానివలె మాట్లాడుతున్నావేమిటి? ఇది నీకు తగినదేనా? ధైర్యాన్ని విడిచి పెట్టడం ఎంత నీచం? గుండె నిబ్బరం చేసుకో! యుద్ధానికి నడుం కట్టు.
అర్జునుడు పలికెను:-
4. అనిచెప్పి ప్రోత్సహించాడు. కానీ - అర్జునుడు దిగులుతో మధుసూదనా! భీష్మ, ద్రోణుల తో నేను యుద్ధం చేయవచ్చా? వారు నాకు గురువులును ,పూజనీయులును కదా! వారిపై బాణ ప్రయోగం చేసి ఎదుర్కొనటం తగినదేనా?
5. వారు మహానుభావులు, గురువులునై యుండటం వల్ల వారిని చంపటం మాని బిచ్చమెత్తుకుంటూ బ్రతకటం మంచిదనిపిస్తోంది.
6. వారిని చంపి నెత్తురు కూడు ఏ విధంగా తినగలను? ఎలా జరుగుతుందో అలాగే కానిమ్మని వీరితో యుద్ధం చేసినట్లయితే మా యిరు పక్షాలలో నెవరు బలవంతులో . ఆ పరిస్థితులలో నెవరికి జయం కల్గుతుందో . మేమే వారిని జయించినప్పటికి వారంతా చచ్చిన తర్వాత మేము మాత్రం బ్రతకాలని ?
7. బంధువులైన కౌరవాదు లెదురుగ నిలిచియుండగా వీరి నేవిధంగా చంపగలం? నా మనస్సు దయ వలన వ్యాకులత పొంది ధర్మాధర్మ విచక్షణ చేయలేని స్థితికి పోయింది. అందుచేత నిన్ను శరణు వేడుకుంటున్నాను. నేను నీకు శిష్యుడను. నాకేది శ్రేయాన్ని కలుగ జేస్తుందో నీవే నిర్ణయించి నా కాజ్ఞాపించు.
8. శత్రు నాశనం చేసి భుమికంతటికి అధిపతినైనప్పటికీ ని స్వర్గాధిపత్యం పొందినప్పటికీ ని, యింద్రియాలని తపింప జేస్తున్న ఈ శోకం శాంతించే మార్గం నాకు కనిపించటం లేదు.
సంజయుడు పలికేను:-
9. అందుచేత నేను "యుద్ధం చేయలేను " అని చెప్పి మౌనాన్ని వహించాడు.
10. ఇది చూచి శ్రీకృష్ణ భగవానుడు మందహాసం తో తన బావను హేళన చేస్తున్న వాని వాలే భావాల్ని వివరించసాగాడు.
11,12. "అర్జునా! నీ చర్య చాలా వింతగా కనిపిస్తోంది. మహాజ్ఞానులవలె ధర్మ పన్నాలు వల్లిస్తున్నావు. ఏడవకూడని వారికొరకు ఏడ్చే మూఢునివలె శోకిస్తున్నావు. చనిపోయిన వారిని గురించి గాని బ్రతికియున్న వారిని గురించి గాని పండితులెన్నడూ శోకించరు. నేనుగాని, నీవుగాని ఈ రాజలోకం గాని, యొకప్పుడు లేకుండ నుండలేదు. జరిగిపోయిన కాలంలో కూడ వున్నాం మరణానంతరం కూడా లేకుండా పోము.
13. ఈ దేహమందు దేహియగువాడు బాల్య, యవ్వన, కౌమార వార్ధక్యావస్థలు పొందే విధంగానే ఈ శరీరాన్ని విడిచిన తరువాత మరియొక దానిని యాశ్రయించటం జరుగుతుంది. ఇందు కొఱకు ధీరుడైనవాడు మోహాన్ని పొందడు.
14. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి యింద్రియాలతో కూడినవై చలి-వేడి, సుఖం-దుఃఖం మొదలైన అనుభవాల్ని కలిగిస్తుంటాయి. అవి ఎప్పుడూ ఉండేవికావు. అనిత్యాలు.
15. అందుచేత శీత తాప సుఖదుఃఖాది ద్వంద్వాతీతుడైన ధీరుడే అమృతత్వాన్ని సాధించగలడు.
16. లేని వస్తువున కునికిలేదు. ఉన్నవస్తువు లేకుండా పోదు. ఆత్మ సత్తనియు, అనాత్మయైన ఈ శరీరం అసత్తనియు తత్వ వేత్తలు మాత్రమే గ్రహించగలరు.
17. ఈ జగత్తంతా నిండియుండి నిబిడీకృతమైన ఆత్మ వస్తువు నాశనంలేనిది. దాని నెవ్వరును నశింపజేయలేరు.
18. ఇదియే ఆత్మ అనబడుతుంది. ఆ ఆత్మ నాశనంకానిదీ, నిత్యమైనదీ, అప్రమేయమైనదీ అయివుండి దేహాన్ని ధరిస్తూ వుంటుంది. ఈ దేహాలు అశాశ్వతాలై యుండుట వలన నశిస్తుంటాయి. అందుచేత యుద్ధానికి సిద్ధపడు.
19. ఈ ఆత్మను చంపువానిగ భావించేవాడును, చంపబడువానిగ నెంచేవాడును వీరిద్దరూ తెలియనివారే అవుతారు కారణ మేమిటంటే, ఈ ఆత్మ చంపునదిగాని, చంపబడునది గాని కాదు.
20. ఈ ఆత్మ పుట్టదు. ఎప్పుడును చావదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేకుండనూ పోదు. అందుచే నిది నిజమును, నిత్యమును, శాశ్వతమును, పురాణమునై యుంది. శరీరము చంపబడినంత మాత్రాన అది మాత్రం చంపబడదు.
21. ఎవడీ యాత్మకు అవినాశిగను, నిత్యునిగను, ఆద్యంతములు లేనివానిగను తెలిసికొనునో - అటువంటి వాడు ఎవనినెట్లు చంపును? ఎవనినెట్లు చంపించును?
22. మనం చినిగిన పాత వస్త్రాల్ని విడిచి క్రొత్త వాటిని యే విధంగా ధరిస్తూ ఉంటామో - అదే విధంగా జీర్ణించి పోయిన ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ క్రొత్త దేహాల్ని ధరిస్తూ వుంటుంది.
23,24,25. ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు. వాయువు సోషింప చేయలేదు. అది నరుకబడదు. దహింపబడదు. తడుపబడదు. ఎండదు. ఎల్లప్పుడూ అంతటా నిండి యుంటుంది. అది స్థిరమునూ, సనాతనమునూ అచలమూనై యుంది. అది యింద్రియాలకు కనిపించదు. దానిని గురించి మనస్సుతో నూహించుటకు కూడ సాధ్యం కాదు. దాని కెటువంటి మార్పును లేదు. ఇటువంటి యాత్మతత్వాన్ని గ్రహించి నీ శోకాన్ని విడిచి పెట్టు.
26. ఒక వేళ ఆత్మ నిత్యమును చచ్చుచుండునని తలంతువేమో- అప్పుడైనను దానిని గురించి శోకించాల్సిన యవసరం లేదు.
27. పుట్టిన వాడు చావక తప్పదు. ఆ విధంగానే చచ్చిన వాడు తిరిగి పుట్టక తప్పదు. తప్పని సరియైన ఈ విషయాన్ని గురించి ఎందుకు అనవసరంగా విచారిస్తున్నావు?
28. మనుష్యాది సమస్త భుతాలకు తొలుత రూపాలు లేవు. మధ్యలో వానికి రూపం వచ్చింది. తుదకవి మృత్యువును పొంది మాయం కాక తప్పదు. అటువంటి క్షణికాలైన వాటికొఱకెందుకు దుఃఖిస్తావు?
29. చావును గురించి దేహికి దేహానికి గల సంబంధం గురించి వింతగా చూస్తారు. వింతగా చెపుతారు. ఆశ్చర్యంతో వింటారు. దీనిని గూర్చి విన్నప్పటికీ, చెప్పినప్పటికీ కూడా నిజంగా దీని నెరింగినవాడొక్కడును లేడు.
30. అర్జునా! ప్రతి దేహంలోను నివసించే దేహి నిత్యుడును, అవధ్యుడును అయి వుండటం వలన ఏ జీవికొఱకును దుఃఖించాల్సిన పనిలేదు.
..... మిగితాది త్వరలో .......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి